Home » Stotras » Manidweepa Varnana Stotram
manidweepa varnana stotram

Manidweepa Varnana Stotram

మణిద్వీప వర్ణన (Manidweepa Varnana)

మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 ||

సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 ||

లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3||

పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు
మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||

అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు
పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||

కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు
ఏడామడల రత్న రాశులు మణిద్వీపానికి మహానిధులు || 9 ||

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాదిపతులు మణిద్వీపానికి మహానిధులు || 10 ||

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్య
పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 11 ||

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వ శుభప్రధ ఇచ్చాశక్తలు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 12 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మిలమిలలాడే ముత్యపు రాశులు తలతలలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 ||

కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||

భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచాశక్తులు
సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్య కాంతి శిలమహాగ్రహాలు
ఆరుఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మంత్రిని దండినీ శక్తి సేనలు కాళీ కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 ||

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు
గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 ||

సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 ||

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 20 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||

దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||

శ్రీ విగ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 ||

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాశులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||

దుఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||

పదనాల్గు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మనిద్వీపం సర్వేశ్వరీకది శాశ్వతస్థానం || 27 ||

చింతామణుల మందిరమందు పంచాబ్రహ్మలు మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరీ తో నివసిస్తాడు మనిద్వీపము లో || 28 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మనిద్వీపము లో || 29 ||

పరదేవతను నిత్యము కొలిచిమనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలు ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || 30 || (2)

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు || 31 || (2)

శివకవితేస్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 32 ||

మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిల్లుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీ అమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.

ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.

సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.

పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.

వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది.ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.

చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.

శ్రీ లలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.

శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.

Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram

శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Samba Sada Shiva bujanga Prayatha Stotram) కదా వా విరక్తిః కదా వా సుభక్తిః కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః  | హృదాకాశమధ్యే సదా సంవసన్తం సదానందరూపం శివం సాంబమీడే...

Sri Kali Stotram

శ్రీ కాళీ స్తోత్రం (Sri Kali Stotram) నమస్తే నీలశైలస్థే ! యోని పీఠనివాసిని ! భద్రకాళి ! మహాకాళి ! కామాఖ్యే ! కామసుందరి ! ఇహావతరకళ్యాణి ! కామరూపిణి! కామిని ! కామేశ్వరి ! మహామాయే! ప్రాగ్జ్యోతిషపురేశ్వరి !...

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

Saraswati stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Saraswati stotram) సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః ఇంద్రనీలాలకా చంద్రబింబాననా పక్వబింబాధరా రత్నమౌళీధరా చారువీణాధరా చారు పద్మాసనా శారదా పాతుమాం లోకమాతా సదా స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా ఫాల కస్తూరికాయోగి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!