శ్రీ సిద్ధి ధాత్రి దేవీ (Sri Siddhidatri Devi )
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.
Leave a Comment