Home » Samskruthi » 24 Ekadashalu Names and benefits

24 Ekadashalu Names and benefits

ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు (24 Ekadashalu Names and benefits)

చైత్ర మాసం

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

౦2. వైశాఖ మాసం

వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి – ‘అపరా’ – రాజ్యప్రాప్తి

౦౩. జ్యేష్ఠ మాసం

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – ‘నిర్జల” – ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి – ‘యోగిని’ – పాపములను హరిస్తుంది

04. ఆషాఢ మాసం

ఆషాఢ శుద్ధ ఏకాదశి – ‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి)
ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ కోరిన కోర్కెలు ఫలిస్తాయి

05. శ్రావణ మాసం

శ్రావణ శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి – ‘ఆజా’ – రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ

06. భాద్రపద మాసం

భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి) భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును

07. ఆశ్వయుజ మాసం

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి – ‘పాపంకుశ’ – పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి – ‘రమా’ – స్వర్గప్రాప్తి

08. కార్తీక మాసం

కార్తీక శుద్ధ ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)

09. మార్గశిర మాసం

మార్గశిర శుద్ధ ఏకాదశి – ‘మోక్షదా’ – మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
మార్గశిర బహుళ ఏకాదశి – ‘విమలా’ -(సఫలా) – అజ్ఞాన నివృత్తి

10. పుష్య మాసం

పుష్య శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
పుష్య బహుళ ఏకాదశి – ‘కళ్యాణీ’ (షట్ తిలా) ఈతిబాధా నివారణం

11. మాఘ మాసం

మాఘ శుద్ధ ఏకాదశి – ‘కామదా’ (జయా) – శాపవిముక్తి
మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకలకార్య విజయం

12. ఫాల్గుణ మాసం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘ఆమలకీ’ – ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘సౌమ్య’ – పాపవిముక్తి
(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్లవిషయంలో కొన్ని బేధాలున్నాయి.)

24 ఏకాదశులలోనూ – సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సౌరమానం ధనుర్మాసం కాగా, అందువచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నరాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా — కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.

Know more: Ekadashi Vratam (ఏకాదశి వ్రతం)

ఏకాదశి ప్రాశస్త్యం
భారతీయులకు ఉన్నన్ని పండుగలు ఇతర దేశస్థులకు లేవు. ప్రతీ పండుగలోనూ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆరోగ్యాది విశేషాలు లీనమై ఉంటాయి. వాటిని గుర్తించి, ఆంతర్యాన్ని గ్రహించి, ఆయా పండుగలు, వ్రతాలు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఐహికముష్మిక ఫలాలు సిద్ధిస్తాయి.

సర్వమూ కాలాధీనం. “కాలః కలయతా మహమ్” అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది. కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు. అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం, చాంద్రం, సావనం, నక్షత్రం – అని నలుగు విధాలుగా సూచించి, గణించడం జరిగింది. దక్షిణాదిలో సౌరచాంద్రమానాలే గణనీయాలు. మనం చైత్ర వైశాఖ మాసాలని, పాడ్యమి, విదియ తిథులని చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాము. చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు. సూర్యుణ్ణి ఆధారంగా – సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించి ఉండే నెలరోజులకూ ఆయా మాసంగా చెప్పబడుతుంది. సౌరమానం మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలినవై ఎక్కువ శాతం ఆయా తేదీలలోనే వస్తుంటాయి. కనుకనే తమిళులకు ఏప్రియాల్ ఒకటవ తేదీన మేషమాసం ఆరంభమై సంవత్సరాది అవుతుంది. “రవేః సంక్రమణం రాశౌ సంక్రాంతి రితి కథ్యతే” అనుటచేత ఒక్కొక్క మాసమూ ఒక్కొక్క సంక్రాంతి అవుతుంది. అదే విధంగా మకర సంక్రాంతి జనవరి 14 నుండి, కర్కాటక సంక్రాంతి జూలై 16 వరకు ఉత్తరాయణం… జూలై 17 నుండి జనవరి 13 వరకు దక్షిణాయనం అని అంటున్నాం.
“ఆయనే దక్షిణే రాత్రి రుత్తరే తు దివా భవేత్” అని కపింజల సంహిత వాక్యం. దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు మానవులకు ఒక సంవత్సర కాలమైతే, దేవతలకు ఒక అహోరాత్రమైన దినం. సూర్యుడు ధనూరాశిలో ఉండే మాసం ధనుర్మాసం. ఈ నెలలో ఉషఃకాలం చాలా ప్రాముఖ్యమైనది. “ధనుః సంక్రాంతి మారభ్య మాస మేకం వ్రతం చరేత్” అనుటచే ధనుర్మాసం నెలరోజులూ శ్రీహరిని విధిగా బ్రాహ్మీకాలంలో పూజించాలి. ఈవిధంగా ఆచరిస్తే

“కోదండస్థే సవితరి ప్రత్యూషః పూజయే ద్ధరిమ్
సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతి”

ధనుర్మాసంలో ఒక్కరోజు ఉషఃకాలంలో శ్రీహరిని అర్చిస్తే వెయ్యేళ్ళు నిత్యమూ అర్చించిన ఫలితం సిద్ధిస్తుంది. 30 రోజులు అర్చించేవారికి ౩౦ వేలయేళ్ళు అర్చించిన అనంత ఫలం లభిస్తుంది. అనంతుడిని అనంతంగా అర్చిస్తే అనంత ఫలమే సిద్ధిస్తుంది.

ధనుర్మాసం సౌరమాసానుసారం రాగా, శుక్లపక్ష ఏకాదశి చాంద్రమానమైన తిథి ప్రతీమాసంలోనూ రెండు ఏకాదశులు(శుక్ల-బహుళ) వస్తాయి. (అధికమాసంలో మరో రెండు అధికం) మొత్తమ్మీద సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశి ఎంతో పవిత్రమైనది.

గృహస్థో బ్రహ్మచారీన ఆహితాగ్నిస్తథైవచ
ఏకాదశ్యాం న భుంజీత పక్షయో రుభయోరపి

బ్రహ్మచారి, గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రుడు ఎవరైనా కావచ్చు, ఉభయ ఏకాదశులలో భోజనం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇంత నిష్ఠతో కూడుకున్న ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమైనది.అందుకే ఏకాదశిని “హరివాసరం” అన్నారు పెద్దలు.

మధుకైటభులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్యరూపాలు ధరించి, దివ్యజ్ఞాన్నాన్ని పొంది, “దేవా ! వైకుంఠము వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పూజ చేసి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వారమార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠప్రాప్తి కలిగించు” అని ప్రార్థించిరి. స్వామి “తథాస్తు” అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి “మోక్షోత్సవదినం” అని కూడా అంటారు. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక “ముక్కోటి ఏకాదశి” అని పేరు(ముక్కోటి అనేది 33 కోట్లకు సంకేతమని అంటారు). వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక “వైకుంఠ ఏకాదశి”, భగవద్దర్శనం కలిగిస్తుంది కనుక “భగవదవలోకనదినం” అని పిలుస్తుంటారు.

సుకేతుడనే రాజు విశ్వేదేవతలా ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, భగవదనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడు.సకల పాపాల నుండి విముక్తి పొంది, శ్రీకైవల్యప్రాప్తితో జన్మరాహిత్యం చెందటానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతాచరణ లేదు.

దేవదానవులు ఈ ఏకాదశిరోజున ఉపవాసంతో రాత్రింబవళ్ళు శ్రమించి, క్షీరసాగరాన్ని మధించగా, ద్వాదశినాడు మహాలక్ష్మీ సముద్రం నుండి ఉద్భవించి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది.

ఆనాటి నుండి ఏకాదశినాడు పగలు, రాత్రి ఉపవాసంతో ఉండి, జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృపవల్ల ముక్తి లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది.

శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవకళ చంద్రునిలోకి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్రమండలం నుండి పదకొండవకళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకల వలెనే ఏకాదశి అనే పేరు సార్థకమైనది. “ఏకాదశ్యా ముపవస్యే న్న కదాచి దతిక్రమేత్” – ఏకాదశినాడు తప్పక ఉపవాసం చెయ్యాలి. ఉపవాసంనాడు “ఉపవాసః స విజ్ఞేయః సర్వభోగవివర్జితః” — పాపకృత్యాలకు దూరంగా(చేయకుండా) ఉండి, సకలభోగాలను వదిలి, పుణ్యకార్యాలు చేయటమే ఉపవాసం అని పెద్దలమాట. 11 ఇంద్రియాలను(పంచ కర్మేంద్రియ+ పంచ జ్ఞానేంద్రియ + మనస్సులు = 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపచేయునదియే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈవ్రతాన్ని ఆచరించవచ్చు. ఎనిమిదేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు, ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు ఉపవాసం చేయాల్సిన పనిలేదని కొన్ని శాస్త్రాలలో పేర్కొనబడ్డాయి.

Know more: Santhana Gopala Swamy Mantram (సంతాన గోపాల స్వామి మంత్రం)

ఏకాదశీ దేవి జననము

పూర్వం కృతయుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే ‘మురుడు’ అనే రాక్షసుడుండేవాడు. దేవతలని జయించి, వేధించేవాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి, అలసి, విశ్రాంతికై బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలో చేరి నిద్రించాడు. మురుడు శ్రీహరిని చేరి సంహరించడానికి సిద్ధపడగా, స్వామి శరీరంనుండి దివ్యతేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య దివ్యాశ్త్రాలతో యుద్ధంచేసి, మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని కన్యను, మరణించిన మురుణ్ణి చూసి ఆశ్చర్యపడినాడు. కన్య నమస్కరించి, జరిగినదంతా వివరించింది. సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి వరం కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో “దేవా ! నేను ఏకాదశినాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక ఈనాడు నా వ్రతం చేస్తూ, ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుంచి తరించేట్లుగా వరమిచ్చి, అనుగ్రహించండి” అని ప్రార్థించింది. స్వామి “అట్లే అగుగాక” అని వరమిచ్చి, అదృశ్యమైనాడు. నాటి నుండి ఏకాదశీ వ్రతం భక్తితో ఆచరించేవారు సకలపాపాలనుండి విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ప్రశస్తి ఏర్పడింది. ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశీదేవి. ఈమె విష్ణు దేహము నుండి ఉత్పన్నమైనది కనుక, ఈమె స్త్రీమూర్తియైన మహావిష్ణువే. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసంఉంటుంది కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బ తీస్తుందని అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఈరోజు గీతోపదేశం జరిగిన రోజు కనుక ‘భగవద్గీత’ పుస్తకదానం చేస్తారు.

ఆధ్యాత్మిక స్ఫూర్తి
వ్రతాలూ, పూజలూ అన్నీ ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై, జ్ఞానవిజ్ఞాన ఘనులై ముక్తులగుట కొరకే ఏర్పడిన విశిష్టసాధనాలు. ఆధ్యాత్మికతత్వం అంతర్లీనం కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధింపదు. సర్వకర్మలు జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయన్నది భగవద్గీత. కనుక వైకుంఠ ఏకాదశీ వ్రతంలోనూ ఆధ్యాత్మిక నిధి విధిగా ఉంటుంది. యథాశక్తిగా ఏకాదశి అంతర్గత తాత్విక ఆనందాన్ని ఆస్వాదిస్తాం.

తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు “నిహితం గుహాయాం విభ్రాజతే”. అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం, ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

Polala Amavasya

పోలాల అమావాస్య (Polala Amavasya): శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహ అయి...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Vaikunta Ekadashi / Mukkoti Ekadashi / Puthrada Ekadashi

వైకుంఠ ఏకాదశి /ముక్కోటి ఏకాదశి / పుత్రద ఏకాదశి (Vaikunta Ekadashi /Mukkoti /Puthrada Ekadashi) వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని...

Rathasapthami Visistatha

రథసప్తమి విశిష్టత (Rathasapthami Visistatha) మాఘ శుక్ల సప్తమిని ‘మహాసప్తమి’ మరియు ‘రథసప్తమి’గా వ్యవహరిస్తారు. సప్తమి అనగా ఏడింటి సముదాయము. అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఈ ఏడింటిని సప్తమి అని అందురు. ఇంద్రియాణి హయాన్యాహు: మన: ప్రగ్రహ ఏవచ |...

More Reading

Post navigation

error: Content is protected !!