Home » Sri Maha Lakshmi » Sri Ashta Lakshmi Swaroopalu
ashta lakshmi swaroopalu

Sri Ashta Lakshmi Swaroopalu

శ్రీ అష్టలక్ష్మీ స్వరూపాలు (Sri Ashta Lakshmi Swaroopalu)

లక్ష్మీ కటాక్షం పొందడానికి ఎంతో శ్రద్ధా భక్తులతో అమ్మను పూజించడం ఆరాధించడం అవసరం. మనకున్న లక్షణాలే మనకున్న ఐశ్వర్యం. మనం సదాచారం పాటించడం, సత్ప్రవర్తన వలన, సత్యనిష్ఠతో మెలగడం వలన లక్ష్మీకటాక్షం తప్పకుండా ఉంటుంది. ఈ లక్ష్మీ దేవిని ఎనిమిది రూపాలలో కొలుస్తాము. ఈ అష్టలక్ష్మీ స్వరూపాలే మనకున్న సమస్తమైన సంపదలనూ సూచిస్తాయి.

అష్టలక్ష్మీ స్వరూపాలు:
1. శ్రీ ఆదిలక్ష్మి
2. శ్రీ ధాన్యలక్ష్మి
3. శ్రీ ధైర్యలక్ష్మి
4. శ్రీ గజలక్ష్మి
5. శ్రీ సంతానలక్ష్మి
6. శ్రీ విజయలక్ష్మి
7. శ్రీ విద్యాలక్ష్మి
8. శ్రీ ధనలక్ష్మి

అమ్మవారి అష్టలక్ష్మీ అవతారాల విశేషాలు:

ఆదిలక్ష్మి:
ఆదిలక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే మనలో ప్రాణశక్తి పరిపూర్ణంగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన వివిధ అంశాలలో ప్రధాన అంశగా అవతరించిన రూపం ఆదిలక్ష్మీ అవతారం. మనం ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాలను గడపగలుగుతాము. మన శరీరంలోని అనేక రుగ్మతలకు మూలకారణం ఈ ప్రాణశక్తి తగ్గడమే అని నిపుణులు ఎన్నో పరిశోధనలు చేసి కనుగొన్నారు. అటువంటి ప్రాణశక్తిని ఈ ఆదిలక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు.

ధాన్యలక్ష్మి:
సర్వ జగత్తులోని జీవులకు ఆహారం జీవనాధారం. అటువంటి ఆహారానికి అధిపతి ఈ ధాన్యలక్ష్మి. “శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం” అన్నారు మన పూర్వీకులు. అనగా “ఏ విధమైన ధర్మ సాధన చేయాలన్నా శరీరం ఎంతో ముఖ్యం” అని అర్ధం. ఆ పరమాత్ముని ధ్యానానికి, సేవకు అవసరమైన క్రియలు చేయాలన్నా మన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. అందువల్ల ఆదిలక్ష్మి అనుగ్రహం వల్ల లభించిన ఈ జీవుని యొక్క శరీరాన్ని, అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ఆహారాన్ని అందించడం కొరకు ఆ అమ్మే ధాన్యలక్ష్మీ అవతారం ధరించింది. ఈ ధాన్యలక్ష్మీ అవతారం సస్యశ్యామలమైన పంట పొలాలలో పండిన పంటల రూపంలో మనకు అందుతుంది. అందువలన మనకు ఆహార ధాన్యాన్ని పండించే రైతులను, భూమిని మరియు పశువులను ఎంతో గౌరవభావంతో చూసుకోవడం అవసరం. అందువల్లనే మన భారతీయ సాంప్రదాయంలో మకర సంక్రమణం నాడు జరుపుకునే సంక్రాంతి పండుగ పంటల పండుగగా జరుపుకుంటాము.

ధైర్యలక్ష్మి:
అష్టలక్ష్మీ దేవతా స్వరూపాలలో మూడవదైన ధైర్యలక్ష్మి అవతారం మనకు సరైన మార్గదర్శకాన్ని చూపడానికి, సరైన వ్యక్తిత్వంతో జన్మను సార్ధకం చేసుకోవడానికి శక్తిని ఇస్తుంది. పిరికివారు జీవితంలో దేనినీ సాధించలేరు, ముందడుగు వెయ్యలేరు అని మనందరికీ తెలిసినదే. ధైర్యగుణం మన మొదటి గురువైన మాతృమూర్తి ద్వారానే మనకు లభిస్తుంది. ఛత్రపతి శివాజీ అంతటి వాడు కాగలిగాడంటే తన తల్లి అందించిన ధైర్యసాహసాలే కారణం అన్నది జగమెరిగిన సత్యము. ఆ ధైర్యలక్ష్మి కృప కలిగినవారు ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు.

గజలక్ష్మి:
లక్ష్మీ అమ్మవారి వైభవ విశేషాలు చెప్పుకునే సమయంలో ఈ గజలక్ష్మీ స్వరూపం ఎంతో ముఖ్యమైన అవతారం. విజయం సాధించడం అంటే ఎవ్వరికైనా ఆనందంగానే ఉంటుంది. కాని మనం సాధించే విజయం లోకహితకరముగా, ఎవ్వరికీ హాని చేయ్యనిదిగా ఉంటేనే, ఆ విజయం శుభకరమైనది అని చెప్తారు. అటువంటి లోకహితకరమైన విజయాన్ని అందించేదే గజలక్ష్మి. ఈ గజలక్ష్మీ అవతారాన్ని ఆరాధించేవారికి కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయి.

సంతానలక్ష్మి:
పిల్లలు మానవ మనుగడకు మూలం. అటువంటి సంతాన వృద్ధి, వంశాభివృద్ధి కలగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలా సత్సంతానప్రాప్తి కలగాలని ఆశించేవారు ఈ సంతానలక్ష్మిని ఆరాధిస్తారు. అమ్మవారి ఈ సంతానలక్ష్మి అవతారాన్ని కడుపు చలవకు, సంతానం లేనివారు సంతానం కలగడానికి ఆరాధిస్తారు. సంతానం కలగడం వంశాభివృద్ధి కొరకు అని మనకు తెలిసున్న భౌతిక విషయం. కానీ మన పూర్వీకుల వద్ద ఉన్న అపారమైన సత్సంప్రదాయం, జ్ఞాన సంపదలను తమ తరువాతి తరాలవారికి అందజేయడమే ఈ సంతాన ఉత్పత్తికి ముఖ్యోద్దేశ్యంగా భావించేవారు. అందువల్లనే సంతానలక్ష్మిని ఆరాధించేవారికి ఆమె అనుగ్రహం కలిగేది. నేడు సంతానం కావాలనుకునేవారి ఆలోచనలు ఎంతో భిన్నంగా, తాము సంపాదించిన సంపదలను తరతరాలుగా కాపాడడానికి, వృద్ధి చెందించడానికి మాత్రమే సంతానం అవసరం అని భావించే రోజులు. అందువల్లనే సంతానం కలుగని వారి సంఖ్య నానాటికీ వృద్ధి చెందుతోంది. అంతే కాక కలిగిన సంతానం కుడా గుణ విహీనులుగానో, అంగ విహీనులుగానో మిగిలిపోవడం మిక్కిలి బాధాకరం. సంతానలక్ష్మి కృపకు పాత్రులు కావడానికి సద్ధర్మ పరాయణులై తమ పిల్లలకు సన్మార్గ దర్శనాన్ని కోరుకోవడం ఉత్తమం.

విజయలక్ష్మి:
జయము లేదా విజయము అనేవి నిత్యం అన్ని విషయాలలో మనం వాడుతూనే ఉంటాము. జయము అనగా అనుకున్నది సాధించడం లేదా గెలవడం అని అర్ధం. మరి జయానికి విశేష శబ్దమైన “వి” చేర్చి విజయం అనడంలోని ముఖ్యోద్దేశ్యం ఏమి అయి ఉండొచ్చు? మనమనుకున్న తుది లక్ష్యానికి చేరుకోవాలంటే ఆ దారిలో ఏర్పడే చిన్న చిన్న అడ్డంకులను దాటి జయం సాధించి చివరకు అంతిమ లక్ష్యం సాధించడమే విజయము. అటువంటి అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి సరైన శక్తిప్రదాత ఈ విజయలక్ష్మీ స్వరూపం.

విద్యాలక్ష్మి:
సకల జ్ఞానసంపదకూ, సృష్టిలోని అపారమైన విచక్షణ మరియు బుద్ధికుశలతకూ కారణ భూతురాలైన లక్ష్మీ స్వరూపం విద్యాలక్ష్మీ స్వరూపం. అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలున్న వారికి చక్కనైన చదువు, జ్ఞానము, కుశల బుద్ధి, వివేకము వంటివి అబ్బి వారు జీవితంలోని అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. వారు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించడమే కాక సకల సుఖశాంతులనూ పొందగలరు.

ధనలక్ష్మి:
నేడు మన మానవ జీవితాలను, మన ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రధానమైన లక్ష్మీ స్వరూపం ధనలక్ష్మీ స్వరూపం. అమ్మ అనుగ్రహం ఉన్నచోట ధనానికి కొదువ లేదు. ధన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఆమె చంచల స్వభావం కలది అని చెప్తారు. కానీ ఏ ఇంట అధర్మం నడుస్తుందో, ఏ ఇంట కలహాలు, దుర్భాషలు ఎక్కువగా ఉంటాయో, ఏ ఇంట శుచీశుభ్రత లేకుండా ఉంటుందో, అటువంటి ఇంట ఈ ధనలక్ష్మి కొలువుండదు. ధనం వృద్ధి చెందినవారు తమ ఇంట ఆమె స్థిరంగా నివాసమేర్పరచుకోవాలి అనుకుంటే ఆమెను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అవసరం. సత్కార్యాలకు, దాన ధర్మాలకు ధనాన్ని వెచ్చించడం శుభకరం.

మానవ జీవితం సుఖప్రదంగా సాగాలంటే అన్ని విషయాలలోనూ ఆ లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎంతో అవసరం. ఎల్లప్పుడూ సత్ప్రవర్తన మరియు సదాచారం పాటించేవారి ఇంట లక్ష్మి ఎప్పుడూ కొలువుంటుంది.
“లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు”
“సర్వే జనాః సుఖినో భవంతు”

Agastya Kruta Lakshmi Stotram

అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం (Agastya Kruta Lakshmi Stotram) మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే || 1 || త్వం శ్రీ రుపేంద్ర...

Sri Ashtalakshmi Ashtottara Shatanamavali

శ్రీ అష్ట లక్ష్మీ అష్టోత్తర శతనామావళి (Sri Ashtalakshmi Ashtottara Shatanamavali) ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహారాజ్నై నమః ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః ఓం శ్రీ మన్నారాయణప్రీతాయై నమః ఓం స్నిగ్దాయై నమః ఓం శ్రీ...

Sri Lakshmi Sahasranama Stotram

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం (Sri Lakshmi Sahasranama Stotram) నామ్నాం సాష్ట సహస్రం చ బ్రూహి గార్య మహామతే | మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తిముక్త్యర్థసిద్ధయే || ౧ || శ్రీ గార్గ్య ఉవాచ- సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభం | అపృచ్ఛన్యోగినో భక్త్యా...

Sri Mahalakshmi Ashtakam

శ్రీ మహా లక్ష్మీ అష్టకం (Sri Mahalakshmi Ashtakam) ఇంద్ర ఉవాచ  నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 1 || మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!