కుక్కే సుబ్రహ్మణ్య (Kukke subrahmanya Temple)

జగన్మాత పార్వతీదేవి, లయ కారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో ఆలయాలు ఎక్కువగా వున్నాయి. వీటిలో మరో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కేలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిమి ఆలయం.

kukke-subrahmanya-karnataka

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

ప్రకృతి ఒడిలో

పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలిసి నిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర

సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం.

నాగులకు రక్షకుడు

నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.

కుమారధారలో పవిత్ర స్నానం

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

కుక్కే కు ఎలా చేరుకోవాలి

రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగుళూరు నుంచి 278 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బెంగుళూరు, మంగళూరు నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు “సుబ్రహ్మణ్య రోడ్ (స్టేషన్ కోడ్ – SBHR)” మీదుగా వెళుతాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!