Home » Temples » Sri Lakshmi Narasimha Swamy Temple, Mattapalli

Sri Lakshmi Narasimha Swamy Temple, Mattapalli

శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ స్వామి ( Sri Lakshmi Narasimha Swamy Temple, Mattapalli)

పదకొండు వందల సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున తంగెడ అనే గ్రామం వుండేది. ఆ ఊరిలో మాచిరెడ్డి అనే మోతుబరి రైతు వుండేవాడు. ఆయన, ఆయన కుటుంబీకులందరూ చాలా ఉదార స్వభావం కలవారు. ఒకరోజు మాచిరెడ్డి తమ పంట భూమిలో అనుములు విత్తటానికి కొడుకులు, పనివారితో కలసి అరకలు కట్టుకొని వెళ్తూ, పెద్ద కోడలు భవనాశనీదేవిని త్వరగా పని ముగించుకుని విత్తనాలు తీసుకుని పొలానికి రమ్మని చెప్పి వెళ్ళారు. ఆమెకూడా మామగారు చెప్పినట్లు విత్తనాలు తీసుకుని పొలానికి బయల్దేరింది. దోవలో శివనామ స్మరణ చేస్తూ వెళ్తున్న జంగమదేవరలు ఈవిడని చూసి భిక్ష అడిగారు. ఆవిడ భక్తి పారవశ్యంలో విత్తనాలకై తీసుకెళ్తున్న అనుములనన్నింటినీ వారికి ఇచ్చేసింది. వారు ఈవిడని దీవించి వెళ్ళిన కొంతసేపటికి విషయం గ్రహించి విత్తనాలు తీసుకు వెళ్ళకపోతే మామగారు ఆగ్రహిస్తారని, భగవంతుడిపై భారం వేసి ఒడిలో అక్కడి ఇసుక పోసుకుని, శివనామ స్మరణ చేస్తూ పొలంలో విత్తనాలులాగా దానినే జల్లింది.

పంట చక్కగా పెరిగి కోతకు వచ్చినప్పుడు కోస్తుండగా ప్రతి అనుముకాయలోనూ బంగారు అనుము గింజలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కోడలిని వివరం అడుగగా ఆమెజరిగిన విషయం చెప్పింది. మాచిరెడ్డి ఆ బంగారు అనుములులో సగం దానం చేసి, మిగిలినదానితో కృష్ణానదికి కొంచెం దూరంలో తంగెడ అనే ఊరు నిర్మించి దాని చుట్టూ మహా దుర్గము, 101 దేవాలయాలు నిర్మించి తాను ప్రభువుగా పాలించాడు. ఆ ఊరిలో ప్రజల సౌకర్యార్ధము ఒక దిగుడుబావి తవ్వించాలని ప్రయత్నించగా, ఎంత లోతు తవ్వినా జలము పడలేదు. ఒక రోజు మాచిరెడ్డి స్వప్నంలో గంగాభవాని దర్శనమిచ్చి నీ కోడలు భవనాశనీదేవి బావిలోకి దిగి నన్ను పూజిస్తే నేను ఉప్పొంగి పొంగుతాను.

అయితే నీ కోడలు నాలో ఐక్యమవుతుంది. మీరు దీనికి అంగీకరిస్తే మీకు గంగ తప్పక లభిస్తుంది అని చెప్పింది. మరునాడు వ్యాకులంతో మాచిరెడ్డి ఈ విషయం పండితులకు తెలియజేశాడు. ఎవరూ ఏమీ చెప్పలేని సందర్భంలో భవనాశనీదేవికి ఈ సంగతి తెలిసి, మామగారి దగ్గరకొచ్చి మీరు నాపై ప్రేమానురాగాలతో ఈ విషయం చెప్పలేక పోతున్నారు. పరమపావనియైన గంగలో ఐక్యమయ్యే ఆదృష్టం ఎందరికొస్తుంది. అయినా నేనెక్కడికి వెళ్తాను. గంగలో ఐక్యమయి నీటి రూపంలో అందరికీ కనబడుతూనే వుంటానుకదా అని కుటుంబంలో వారిని ఒప్పించి బావిలో దిగి గంగమ్మను పూజించింది. గంగ ఉప్పొంగగా, ఆమె అందులో ఐక్యమయింది.

తంగెడు గ్రామాన్నీ, చుట్టూ ప్రాకారాన్ని, భవనాశమ్మ బావినీ, బంగారు అనుములనూ ఇప్పటికీ దర్శించవచ్చంటారు. అవకాశం వున్నవారు మట్టపల్లిలో అడిగి తెలుసుకుని తప్పక చూడండి. మాచిరెడ్డి పాలనలో తంగెడు ప్రజలంతా సుఖంగా వున్న సమయంలో ఒక రోజు స్వప్నంలో మాచిరెడ్డికి ప్రసన్న వదనుడైన శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి, స్వయంభువు అయి తన మూర్తి కృష్ణకి అవతల ఒడ్డున వున్న అరణ్యంలో ఒక గుహలో వున్నదనీ, ఆ మూర్తిని ఇప్పటిదాకా భరద్వాజుడు మొదలగు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారనీ, ఆ ఋషుల సంకల్పానుసారం ఇంక ముందు మనుషులకు కూడా దర్శనమీయదల్చు కున్నాననీ, ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించాడు. మరునాడు మాచిరెడ్డి ఇతర పెద్దలూ వెళ్ళి ఆ అరణ్యంలో ఎంత వెతికినా స్వామిని కనుక్కోలేకపోయారు. స్వామి ఆదేశాన్ని పాటించలేకపోయాననే చింతతో మాచిరెడ్డి స్వామినే తలుచుకుంటూ అలసటతో ఒక చెట్టుకింద సొమ్మసిల్లిపోయాడు. ఆ సమయంలో స్వామి తిరిగి సాక్షాత్కరించి దిగులు చెందవద్దనీ, మాచిరెడ్డికి కనిపించే దూరంలో వున్న ఆరె చెట్టుమీద ఒక గద్ద వున్నదనీ, ఆ చెట్టకు సూటిగా వున్న గుట్టమీద గుహలోనే తానున్నాననీ, గుహ ద్వారం లతలు పొదలతో మూసుకుపోయి వున్నదనీ, వాటిని తొలిగిస్తే తన దర్శనమవుతుందనీ సెలవిచ్చాడు.

మాచిరెడ్డి అత్యుత్సాహంతో లేచి స్వామి ఆదేశానుసారం ఆరె చెట్టు, దానిమీద గద్ద, దానికెదురుగా గుట్ట, గుహ, గుహలోని స్వామినీ కనుగొని అమితానందభరితుడైనాడు. వీరు దర్శించు సమయంలో స్వామి శంఖ చక్రములు, గద, అభయముద్రలతో చతుర్భుజుడై, శేషుడు గొడుగు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణావర్త శంఖముతో, తులసీదళమాలతో, భక్త ప్రహ్లాదునితో, దివ్య దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా దేవతలు మునులు పూజించిన పుష్పాల సుగంధాలు వ్యాపించాయిట. మాచిరెడ్డి తామేకాక ఆ స్వామిని సకల జనులు సేవించుటకు వీలుగా స్వామికి ప్రతి నిత్యమూ సకల సేవలూ జరపటానికీ అన్ని ఏర్పాట్లూ చెయ్యటమేగాక, ముఖ మంటపాన్ని నిర్మింపచేసి ఆలయాభివృధ్దికి విశేషంగా కృషి చేశారు. ఈ స్వామి మహత్యం గురించి అనేక కధలు చెప్పుకుంటారు. ఈయనని సేవించినవారికి ఎటువంటి శతృభయమూ వుండదంటారు. ఇక్కడ స్వామికెదురుగా వున్న ఆంజనేయస్వామి విగ్రహం గురించికూడా ఒక విశేషం చెబుతారు. ఒక రోజు ఉదయం అర్చకులు కృష్ణా స్నానానిక వెళ్ళగా వారికి ఈ విగ్రహం కనిపించి తీసుకువచ్చి దేవాలయములో ఒక మూల పెట్టించారుట. అప్పటికే గ్రహ బాధల నివారణార్ధము స్వామికి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య అధికంగా వుండేది. అలాంటి భక్తులకు స్వప్నంలో స్వామి కోతి రూపంలో వచ్చి పిడిగుద్దులు గుద్దేవారు. వారి గ్రహ బాధలు తొలగేవిగానీ, ఈ పిడి గుద్దులతో దేహ బాధ ఎక్కువగా వుండేది. ఒక భక్తుడికి స్వామి కలలో కనిపించి నా దాసుని నాకెదురుగా నిల్పమని ఆదేశించారు. స్వామి ఆదేశానుసారం ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్వామి ఎదురుగా ప్రతిష్టించారు. అప్పటినుంచీ భక్తులకా బాధ తప్పింది. ఆయన ప్రసన్న ఆంజనేయునిగా భక్తులని ఆశీర్వదిస్తున్నారు.

గర్భ గుడిలో స్వామికి ఎడమ ప్రక్కన ఒక గుహ ద్వారం వుంది. అక్కడనుండి సప్త ఋషులు, ఇతర మునులూ కృష్ణలో స్నానంచేసి స్వామి దర్శనానికి వస్తారుట. వాళ్ళు ఇప్పటికీ రోజూ వస్తారని ఇక్కడి వాళ్ళ నమ్మకం. స్వామికి కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్ధం తర్వాత కట్టింది. ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానంచేసి, స్వామి గర్భాలయానికి ఎదురుగా వున్న ఆరె చెట్టు, ధ్వజ స్తంభం, ఆంజనేయస్వామ చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రంయొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే మట్టపల్లి స్వామివారే స్వయంగా చెప్పారుట. సంపూర్ణమైన విశ్వాసం మరియు భక్తితో ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కె తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు నేను తీరుస్తాను అని. ఇంకా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు వున్నవారు, సంతానము లేనివారు నా క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడుపూటలు కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో మీ అన్ని కోర్కెలు తీరుస్తాను అని చెప్పారుట.

స్వామి మీద నమ్మకంతో భక్తులు ఆలయం ఎదురుగావున్న కృష్ణా నదిలో స్నానం చేసి, ఆ తడి బట్టలతోనే ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు. సాధారణంగా విష్ణుమూర్తికి తులసీ దళములు ప్రీతికరమైనా, ఇక్కడ స్వామి పూజకి ఈ ఆరె పత్రినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు వల్లనేకదా స్వామి ఉనికి తెలిసింది. ఇక్కడ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను స్వామిని శాంతింప చేయటానికి తర్వాత ప్రతిష్టించారు అన్నాలయ్య. ఇక్కడ అనేక సత్రాలున్నాయి. ఈ సత్రాలలో భోజన వసతి వున్నది. ఈ క్షేత్రంలో అన్నదానం ఎంత జరుగుతుందో, స్వామి అంత సంతోషిస్తారు అని నానుడి. దీనికి కారణం స్వామి గర్భాలయంలో మూల విరాట్ ముందు వుండే, ఆనాటి భరద్వాజ మహర్షాదులచే పూజించబడిన దక్షిణావర్త శంఖమని పెద్దలు చెబుతారు.

ఇక్కడ సత్రాలున్నాయి. ఇక్కడ వసతి గృహాలు అద్దెకు దొరుకుతాయి. ఇన్ని మహిమలున్న మట్టపల్లి క్షేత్రాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించండి.

Penchalakona Kshetram

పెంచలకోన క్షేత్రం(Penchalakona Kshetram) దట్టమైన అడవిలో సుందర ప్రశాంత వాతావరణములో కొండల మధ్యలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి నామస్మరణతో ఓం “శ్రీ లక్ష్మీనరసింహస్వామియేనమః” అంటూ పునీతమవుతున్న పవిత్ర క్షేత్రం పెంచలకోన, ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామివారు భక్తులచే నిత్యా పూజలు అందుకుంటున్నారు. పెంచలకోన...

Puri Jaganatha Ratha Yatra

పూరిజగన్నాథ రథ యాత్ర (Puri Jaganatha Ratha Yatra) మన దేశము లో నాలుగు దిక్కుల పవిత్ర పుణ్యక్షేతాలను ‘ చార్ ధామ్‌’ గా పిలుస్తారు . ఉత్తరాన – బదరీ, దక్షినాన – రామేశ్వరము , పడమరన – ద్వారక...

Mopidevi Subramanya Swamy Temple

Mopidevi Subramanya Swamy Temple సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం Mopidevi Temple is located 70 Kms...

Konark Surya Temple

కోణార్క్ సూర్యనారాయణ మూర్తి దేవస్థానం (Konark Surya Temple) సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన కోణార్క్ ఆలయం విశిష్టతలు భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయం ఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం 13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం...

More Reading

Post navigation

error: Content is protected !!