గండి ఆంజనేయస్వామి దేవాలయం (Gandi Sri Anjaneya Swamy Kshetram)

స్వయంగా శ్రీరాముడే చెక్కిన శిల్పం

మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో 107 ఆలయాలలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు. అయితే, కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం… తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే కడప జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం. అత్యంత మహిమాన్వితమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో స్వామికి విశేష పూజలు జరుగుతాయి.

ఈ సందర్భంగా ఈ స్వామికి సంబంధించిన సజీవ చిత్రణ. వేంపల్లె సమీపాన పాల కొండల కనుమ గుండా పోవు పాపాఘ్ని నది తోవ (గండి) మిక్కిలి ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ పర్వత పంక్తుల ఎత్తు దాదాపు రెండు వేల అడుగులు.. పాపాఘ్ని నది ఎల్తైన కొండ, లోయల మధ్య మలుపులు తిరిగి ప్రవహించి కడప వైపు మైదానంలో ప్రవేశిస్తుంది. పాలకొండలకు చొచ్చుకొని పోవు చోట కుడి వైపు ఒడ్డున గండి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. దీనికి ఓ పురాణ గాథ ఉంది.

శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు ఈ ప్రాంతంలో తపోనిష్టుడై ఉన్నాడు. రాముడికి ఆశీస్సులు అందించిన వాయుదేవుడు, తిరుగు ప్రయాణంలో రావణుడిని సంహరించి వచ్చేటప్పుడు ఇదే మార్గంలో రావాలని కోరాడు. వాయుదేవుని కోరిక ప్రకారం సింహళ (శ్రీలంక) విజయ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు రాముడు తన పరివారంతో సహా ఒకరోజు ఇక్కడ బస చేశాడు. వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం ఇవ్వడం కోసం రెండు కొండలకు మధ్యలో ఒక బంగారు తోరణం నిర్మించాడు.శ్రీరాముడు అక్కడ ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఒక శిలపై తన బాణపు ఉలితో ఆంజనేయుడి రూపాన్ని చిత్రించాడు.

కాలి చిటికెన వేలిని చెక్కేలోగా రాహుకాలం రావడంతో అంతటితో వదిలేశాడట రాముడు. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం. దేవతానుగ్రహం వల్ల పుణ్యాత్ములకు అవసాన దశలో ఆ బంగారు తోరణం కనిపిస్తుందని విశ్వాసం. అప్పటి జిల్లా కలెక్టర్‌ థామస్‌ మన్రో తన కడపటి ప్రయాణాన ఈ గండి మీదుగా వెళ్లినప్పుడు ఈ తోరణం కనిపించదట. ఈ తోరణాన్ని చూసిన వారు త్వరలో మరణిస్తారని తెలుసుకోవడంతో ఆయన అనుచరులు ఎంతో ఆందోళన పడ్డారట. చివరికి అదే నిజమని తేలింది. కడప బ్రౌన్‌ గ్రంథాలయంలోని ఒక పుస్తకంలో ఈ వివరణ కనిపిస్తుంది.

పవిత్ర పాపాఘ్ని నది
పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది. కోలార్‌ జిల్లాలోని నందికొండే నంది పాదమని చెబుతారు. పాపాఘ్ని అంతటా పవిత్రమే అయినా ఐదు స్థలాలలో మరింత పవిత్రతను పంచుకుంది. దీని ఉత్పత్తి స్థానం నంది కొండ ఒకటి, వాయు క్షేత్రంగా గండి రెండవది.. కేశవ తీర్థం మూడవది.. భాస్కర క్షేత్రంగా ఉన్న వేంపల్లె నాల్గవది, పాపాఘ్ని నది పినాకిని (పెన్నా) నదిలో కలిసే చోటు ఐదవది. ఈ ఐదు స్థానాలలో పాపాఘ్ని నది మహా పవిత్రంగా పరిగణింపబడుతోంది. పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

గండిలో ఉన్న దర్శనీయ స్థలాలు
గండి పుణ్యక్షేత్రంలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. భూమానంద ఆశ్రమం.. నామాలగుండు, దాసరయ్య కోన, మాతంగ గుహ, జీకొండ్రాయుని మేరు పర్వత శిఖరం, శ్రీచౌడేశ్వరి ఆలయం, ఉమామహేశ్వరాలయం, పావురాల గుట్ట, ఏకదంతపు నాయుని కోట, గవి మల్లేశ్వరస్వామి ఆలయం, కోదండ రామాలయం, శనేశ్వరాలయాలు ఉన్నాయి.

సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు
గండికి సమీపంలో 8కి.మీ దూరంలో పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. గండి వీరన్నగట్టుపల్లె సర్కిల్‌ వద్ద నుండి తూర్పు వైపు వెళితే వైఎస్‌ఆర్‌ ఘాట్, ఎకో పార్కు, ట్రిపుల్‌ ఐటీ, నెమళ్ల పార్కు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. గండికి వచ్చిన భక్తులందరూ ఈ ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు.

శ్రావణ మాస శోభ
ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు ఇప్పటికే మొదలయ్యాయి. తొలి శనివారం పూజ పూర్తయింది. ఈ నెల 5వ తేదీన రెండవ శనివారం, మూడవ శనివారం ఆగస్ట్‌ 12న, నాల్గవ శనివారం ఆగస్ట్‌ 19వ తేదీలలో గండి క్షేత్రంలో శ్రావణ మాస శోభ కనిపిస్తుంది. నాల్గవ శనివారం స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నాలుగు వారాలలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దుష్టశక్తులను తరిమికొట్టే దేవుడి గానే గాక సంతానప్రదాతగా కూడా స్వామికి పేరుంది. గండి ఆంజనేయస్వామిని కొలిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉండటంతో భక్తుల సందడి అధికంగా ఉంటుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!