Home » Karthika Puranam » Karthika Puranam Part 1

Karthika Puranam Part 1

కార్తిక పురాణం
1వ అధ్యాయము – కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట

శ్రీ మధఖిలా౦డకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.

ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి “ఆర్యా! తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహాస్యములు సంగ్రహముగ గ్రహించినారము. కార్తీకమాస మహాత్మ్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును వివరించవలసినది” అని కోరిరి.

అంత నా సూతమహర్షి “ఓ మునిపుంగవులారా! ఒకప్పుడు యిదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సా౦బశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెను.అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగుటయే గాక, యీహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్దగా నాలకింపు” డని యిట్లు చెప్పెను.

పూర్వ మొకానొక దిన౦బున పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి “ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడెడిదియగు వ్రతమును వివరింపు”డని కోరెను.అంతట మహేశుడు మందహాసమొనరించి “దేవి! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు, చూడు మా మిథిలానగరమువైపు” అని మిథిలానగరపు దిశగా చూపించెను.

అట, మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాద్యములతో సత్కరించి, కాళ్లుకడిగి, ఆ జలమును శిరస్సు పై జల్లుకొని ‘మహాయోగి! మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేహము పవిత్రమైనది. తమరిచటికేల వచ్చితిరో సెలవొసంగు’డని వేడుకొనెను.

అందులకు వశిష్ఠుడు – జనక మహారాజా! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభి౦తమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని అని పలుకగా జనకుడు “మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్నా! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది. కావున తాము కార్తీక మహత్మ్యమును గురించి వివరించవలసినది” యని ప్రార్ధి౦చెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి “రాజా! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడ నాన౦దదాయకమైనది. అ౦తియే గాక వినినంత మాత్రముననే యెట్టి నరక బాధలును లేక యీహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్దగా ఆలకింపు” మని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట
ఓ మిథిలేశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను యే వయసువాడైనను ‘ఉచ్చ – నీచ’ అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశియ౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతపూజలను చేసినచో – దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డవలెను. ముందుగా కార్తిక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి “ఓ దామోదరా! నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము” అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలయును.

కార్తిక స్నాన విదానము
ఓ రాజా! ఈ వ్రతమాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమున మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప, నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిధి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి, తన యింటి వద్దగానీ, దేవాలయములోగాని, లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందుగాని, విష్ణ్వాలయమందుగాని లేక తులసికోట వద్ద గాని, దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి, వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహత్మ్యమ౦దలి మొదటి అధ్యాయము – మొదటి రోజు పారాయణము సమాప్తం.

Karthika Puranam Part 11

కార్తిక పురాణం (Karthika Puranam Part 11 11వ అధ్యాయము – మ౦థరుడు – పురాణ మహిమ ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను...

Karthika Puranam Part 16

కార్తీక పురాణం – 16 16వ అధ్యాయము – స్తంభ దీప ప్రశంస వశిష్టుడు చెబుతున్నాడు – “ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా...

Karthika Puranam Part 2

కార్తిక పురాణం 2వ అధ్యాయము – సోమవార వ్రత మహిమ శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః | తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో...

Karthika Puranam Part 20

కార్తీక పురాణం – 20 20వ అధ్యాయము – పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో “గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!