కోణార్క్ సూర్యనారాయణ మూర్తి దేవస్థానం (Konark Surya Temple)
సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన కోణార్క్ ఆలయం
విశిష్టతలు
భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయం ఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం 13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ(క్రీ.శ. 1236 – క్రీ.శ. 1264) నిర్మించినట్లు చారిత్రాత్మక కథనాల్లో పేర్కొనబడింది. దీని నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే. 24 చక్రాలు కలిగిన ఒక భారీరథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లుగా కనువిందు చేస్తుంటుంది. దీనిని ఆనాటికాలపు నగిషీలు ఎంతో అద్భుతంగా అలంకరించారు. మత సంబంధిత (బ్రాహ్మణులకు చెందిన) వాస్తుశాస్త్రానికి ఈ ఆలయం ఒక అద్భుత స్మారక చిహ్నం. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింపబడుతోంది.
స్థలపురాణం :
పురాణ కాలంలో శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డాడు. అప్పుడతడు కోణార్క్ దేవాలయానికి దగ్గరలో వున్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో అతడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా.. అందులో సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాంతో సూర్యభగవానుడు తనని అనుగ్రహించాడని భావించి సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అలా ఆవిధంగా ఇక్కడ ఆలయం ఏర్పడింది. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం మాత్రం కన్పించదు. అసలు ఆ విగ్రహం ఏమైందన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోణార్క్ లో ఉన్న ఆలయాన్ని గంగవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్లపాటు కష్టపడి ఈ ఆలయాన్నినిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఆలయ విశేషాలు :
దేవాలయ ప్రధానద్వారం వద్ద ఉండే రెండు సింహపు విగ్రహాలు యుద్ధ ఏనుగును తొక్కివేస్తున్నట్టుగా దర్శనమిస్తాయి. పైనుంచి చూసినప్పుడు ప్రతి ఏనుగు మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ఒక నృత్య మందిరం కూడా కనిపిస్తుంది. సూర్యభగవానుడికి వందనం సమర్పించేందుకు దేవాలయ నృత్యకారులు ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. దేవాలయం మొత్తం మీద వివిధ రకాల పుష్ప సంబంధిత, రేఖాగణిత నమూనాలు దర్శనమిస్తాయి. శృంగారాన్ని ఆస్వాదించే రూపంలో మనుష్యులు, దేవతలు, పాక్షిక దైవత్యం కలిగిన రూపాలు సైతం దేవాలయంలో కనిపిస్తాయి.
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలూ ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం.
కోణార్క్లో
సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ కోణార్క్ దేవస్థానం ఒక అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా పేర్కొనవచ్చు.
Leave a Comment