శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy)
శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
శిలాదులనే ఋషి ఉండేవాడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ ఋషికి పిల్లలు లేకపోవటం లోటుగా ఉండేది. ఎలాగైనా తనకు సంతాన భాగ్యం కలిగేందుకు శివుడికి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలాగే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే వున్నాడు. అతని వంటినిండా చెదలు పట్టినా సరే శిలాదుడు ఆపలేదు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తనకి సంతానం ప్రసాదించమని ఆ శివుడ్ని వేడుకున్నాడు.
అతని పరమభక్తి కి మెచ్చిన శివుడు తధాస్తు అన్నాడు. శివుడి వరాన్ని పొందిన శిలాదుడు ఒకసారి యజ్ఞం చేస్తుండగా ఆ అగ్ని నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్ధం. ఆ బాలుడి మేధస్సు అసాధారణంగా ఉండేదట. అతను చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేసాడు. ఒకనాడు శిలాదుడు ఆశ్రమానికి మిత్ర వరధులు అనే దేవతలు వచ్చారు. ఆ ఆశ్రమంలో తిరుగుతున్న నందిని చూసి అతను తమకు చేసిన అతిధి సత్కారాలు చూసి మురిసిపోయారు. ఆ దేవతలు వెళుతూ వెళుతూ ఆ పిల్లవాడ్ని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తున్నారు. శిలాధుడు అంత భాదలో ఎందుకు వున్నారో అర్ధం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుషు త్వరలోనే తీరిపోతుందనే వార్త శిలాదుడికి తెలిసింది.
ఈ విషయం తెలిసి నంది దీనికి మార్గం కూడా శివుడే చూపిస్తాడని శివుని కోసం తపస్సు చేయసాగాడు. బాలుని తపస్సుకి మెచ్చి శివుడు త్వరలోనే బాలునికి ప్రత్యక్షమయ్యాడు. శివుడ్ని చూసిన నందికి నోటమాట రాలేదు. శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించి వరం కోరుకోకుండా చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. అలాంటి భక్తుడు తన చెంతనే ఉంటే శివుడికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా తనని కాచుకొని ఉంటూ కైలాసానికి రక్షణ నందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది.
శివునికి సంబంధించిన చాలా కధలలో నంది ప్రసక్తి ఉంటుంది. ఒకసారి క్షీరసాగర మధనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట. అప్పుడు శివుడి చెంతనే ఉన్న నంది ఏ మాత్రం ఆలోచించకుండా ఆ కాస్త విషాన్ని తాగేసాడట. మహామహా దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో ఈ మాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని తాగేసిందట. నంది గురించి ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ని శివుడికి సేవకుడిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు.
Leave a Comment